యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌.. దేని గురించి అంటే?

  • ‘Dino Deets’ పేరుతో పాడ్‌కాస్ట్‌లు
  • డైనోసార్లు, శిలాజాల గురించి ఆసక్తికర విషయాలు
  • నారా కుటుంబ సభ్యుల అభినందనలు
  • శుక్రవారం తొలి ఎపిసోడ్‌
మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ ‘Dino Deets’ పేరుతో కొత్త యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించాడు. ఈ సరికొత్త డిజిటల్ ప్రయాణంపై నారా, నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ఈ ఛానల్‌కు సంబంధించిన ప్రమోషనల్ టీజ‌ర్‌లో మంత్రి నారా లోకేశ్‌ కూడా కొడుకుతో కలిసి సందడి చేశారు.

ఈ ప్రమోషనల్ వీడియోలో దేవాన్ష్ ప్రారంభించబోతున్న పాడ్‌కాస్ట్‌ ప్ర‌త్యేక‌త‌ల‌ను లోకేశ్‌ అడిగి తెలుసుకున్నారు. డైనోసార్లు, శిలాజాలు (fossils), పురాత‌న అవ‌శేషాల గురించిన ఆశ్చర్యకరమైన విషయాలను ఈ ఛానల్ ద్వారా దేవాన్ష్ పంచుకోనున్నాడు. నారా దేవాన్ష్ యూట్యూబ్ ఎంట్రీపై తల్లి నారా బ్రహ్మణి సోషల్ మీడియాలో స్పందించారు.

శిలాజాలతో నిండిన గది నుంచి దేవాన్ష్ మైక్ ముందుకు రావడం ఎంతో గర్వంగా ఉందని బ్రహ్మణి పేర్కొన్నారు. తమ చిన్నారి క్రియేటర్ లాంచ్ చేస్తున్న పాడ్‌కాస్ట్‌ను చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఛానల్ మొదటి ఎపిసోడ్ శుక్రవారం విడుదల కానున్నట్లు వెల్లడించారు.

మరోవైపు నానమ్మ నారా భువనేశ్వరి కూడా మనవడి కొత్త ప్రయత్నాన్ని అభినందించారు. చిన్నారి దేవాన్ష్ ఇలా పాడ్‌కాస్ట్ రంగంలోకి అడుగుపెట్టడం చూసి తాను ఆశ్చర్యంతో పాటు ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని చెప్పారు. తనకు ఇష్టమైన డైనోసార్ల టాపిక్‌ను దేవాన్ష్ ఎంతో ఆత్మవిశ్వాసంతో వివరిస్తుంటే తన హృదయం గర్వంతో నిండిపోయిందని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

ఈ విషయాలపై తండ్రి నారా లోకేశ్‌ కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే తనకు కాస్త గందరగోళం కలిగిందని లోకేశ్‌ పేర్కొన్నారు. గది నిండా డైనోసార్ పుస్తకాలు, డైనోసార్ పెయింటింగ్స్, బొమ్మలు కనిపించడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదన్నారు. ఆ తర్వాతే డైనోసార్లపై దేవాన్ష్ సొంతంగా పాడ్‌కాస్ట్ చేస్తున్న విషయాన్ని తనకు చెప్పాడని వివరించారు. పిల్లలు ఎప్పుడూ ఊహించని విధంగా సర్‌ప్రైజ్‌ ఇస్తుంటారని సంతోషం వ్యక్తం చేశారు. దేవాన్ష్ సృష్టించిన ఈ ప్రాచీన ప్రపంచంలోకి ఒక ప్రేక్ష‌కుడిలా ప్ర‌వేశించేందుకు ఆస‌క్తిగా ఉన్నానని చెప్పారు.

Nara Devaansh
Dino Deets
Nara Lokesh
Nara Brahmani
Nara Bhuvaneshwari
YouTube channel
Dinosaurs
Fossils
Podcast
Ancient relics

More Telugu News